Telugudesam: స్టీల్ ప్లాంట్ అంశం చట్టంలో ఉంది కదా.. ఇబ్బంది ఏమిటని రాష్ట్రపతి అడిగారు: టీడీపీ ఎంపీలు
- రాష్ట్రపతితో భేటీ అయిన టీడీపీ ఎంపీలు
- కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ విన్నపం
- స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేపట్టిన విషయం తన దృష్టికి వచ్చిందన్న రాష్ట్రపతి
విభజన హామీల సాధన ప్రయత్నంలో భాగంగా టీడీపీ ఎంపీలు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సందర్భంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు.
కడప ఉక్కు కర్మాగారం కల నెరవేరేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతిని కోరామని సీఎం రమేష్ తెలిపారు. ఉక్కు పరిశ్రమపై దీక్ష చేసిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందని... స్టీల్ ప్లాంటు అంశం చట్టంలో ఉన్నప్పుడు, ఇబ్బంది ఏమిటని రాష్ట్రపతి అడిగారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై నివేదిక కూడా వచ్చిందని, ప్రధాని అనుమతి ఇవ్వాలని చెప్పామని తెలిపారు.
మరో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం ఏపీకి ఎంత అవసరమో రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. విభజన హామీలను సాధించుకోవడానికి తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.