SWEDAN: స్వీడన్ లో హాలీవుడ్ తరహా దొంగతనం.. రాజ దంపతుల కిరీటాలు, ఆభరణాలు మాయం!
- చర్చిలో ప్రదర్శనకు ఉంచిన అధికారులు
- అలారం ఆపేసి మరీ ఎత్తుకెళ్లిన దొంగలు
- గాలింపు ప్రారంభించిన పోలీసులు
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువకాని డ్రామాతో స్వీడన్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా ఓ చర్చిలోకి ప్రవేశించిన దుండగులు.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన 16వ శతాబ్దపు స్వీడన్ రాజు, రాణికి సంబంధించిన బంగారు కిరీటాలు, ఆభరణాలు కొట్టేశారు. అనంతరం పోలీసులకు దొరక్కుండా చక్కగా స్పీడ్ బోడ్ లో పరారయ్యారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్వీడన్ లోని స్ట్రాంగ్నాస్ పట్టణంలో ఉన్న ఓ చర్చిలో 16వ శతాబ్దపు స్వీడన్ రాజు కింగ్ కార్ల్-9, రాణి క్రిస్టీనాకు చెందిన కిరీటాలు, బంగారు ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం మ్యూజియంలోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. ఎలాంటి అలికిడి లేకుండా అత్యవసర అలారంను నిలిపివేశారు.
అనంతరం గాజు అద్దాల్ని పగులగొట్టి ముత్యాలు, విలువైన రాళ్లు పొదిగిన రెండు బంగారు కిరీటాలతో పాటు ఆభరణాలను తీసుకుని స్పీడ్ బోట్ లో పరారయ్యారు. ఈ వస్తువులు అత్యంత అమూల్యమైనవనీ, వీటికి విలువ కట్టలేమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ప్రస్తుతం దొంగల కోసం గాలింపు చేపట్టామని చెప్పారు. ఈ కిరీటాలు, ఆభరణాలు స్వీడన్ జాతీయ సంపద అనీ, దాన్ని దక్కించుకునేందుకు ఇంటర్ పోల్ ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.