USA: విమాన ప్రయాణికుల తనిఖీలు ఆపేద్దామంటున్న అమెరికా... తొలుత 150 చిన్న ఎయిర్ పోర్టుల్లో!
- సాలీనా 115 మిలియన్ డాలర్లు ఆదా
- పెద్ద ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచొచ్చు
- ప్రతిపాదించిన టీఎస్ఏ
అమెరికాలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 150 చిన్న విమానాశ్రయాల్లో తొలి దశలో తనిఖీల నిలుపుదల ప్రారంభించాలని ట్రంప్ సర్కారుకు నివేదిక అందింది. దీనివల్ల సాలీనా 115 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని, ఈ నిధులతో పెద్ద ఎయిర్ పోర్టుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేయవచ్చని, 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తరువాత ఏర్పాటైన టీఎస్ఏ (ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్) ప్రతిపాదించింది. 60 కన్నా తక్కువ సీట్లతో విమానాలు ప్రయాణించే ఎయిర్ పోర్టుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని టీఎస్ఏ ప్రతిపాదించినట్టు 'సీఎన్ఎన్' వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, ఈ కథనాలపై టీఎస్ఏ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ స్పందిస్తూ, తనిఖీల నిలిపివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇదే సమయంలో అటువంటి ఆలోచనేదీ తమ వద్ద లేదని మాత్రం ఆయన వ్యాఖ్యానించక పోవడంతో పాసింజర్ల తనిఖీలు త్వరలోనే నిలుస్తాయని తెలుస్తోంది.