ig: పోలీసులపైనే దాడి చేస్తారా?: ఐజీ గోపాల్ రావు ఆగ్రహం
- పోలీస్ స్టేషన్ పై 50 మంది దాడి చేశారు
- దాడికి పాల్పడిన వారిని గుర్తించాం
- ఎస్సై పనితీరు బాగోలేదనడం సరికాదు
నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ పై నిన్న రాత్రి దాడి చేసి, ఎస్సైని గాయపరిచిన ఘటనపై ఐజీ గోపాల్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేయడం సరైన చర్య కాదని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ పై 50 మంది దాడి చేశారని... దాడికి పాల్పడిన వారిని గుర్తించామని చెప్పారు. ఎస్సై లక్ష్మణరావు పనితీరు బాగోలేదని ఆరోపించడం సరికాదని అన్నారు.
నిన్న రాత్రి స్టేషన్ గేట్లు పగలగొట్టి లోపలకు ప్రవేశించిన కొందరు వ్యక్తులు ఎస్సై లక్ష్మణరావుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాపూర్ హరిజనవాడకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ అనే ముగ్గురు వ్యక్తులు బాకీ ఉన్నారు. వారు బాకీ చెల్లించకపోవడంతో జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఆ ముగ్గురినీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తుండగా... మద్యం మత్తులో ఉన్న పిచ్చయ్య ఎస్సైను దుర్భాషలాడాడు. దీంతో, మెడికల్ చెకప్ కోసం పిచ్చయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వారి బంధువులు స్టేషన్ వద్దకు వచ్చి, వీరంగం వేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి చేశారు.