BJP: వాళ్లు ఎంతగా విడగొడితే.. మేం అంతగా కలసిపోతాం: పశ్చిమబెంగాల్ సీఎం మమత
- బీజేపీ విభేదాలు సృష్టిస్తోందని ఆగ్రహం
- తాను ప్రధాని రేసులో లేనని స్పష్టీకరణ
- కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాతో భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాల మధ్య అనైక్యతకు బీజేపీ కుట్ర చేస్తోందని మమత ఆరోపించారు. విపక్షాల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ వ్యూహం పన్నితే.. 2019 లోక్ సభ ఎన్నికల్లో సమష్టిగా పోరాడటమే తమ వ్యూహంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఫినిష్ అవుతుందని ఆమె జోస్యం చెప్పారు. తాను ప్రధానమంత్రి రేసులో లేనని మమత స్పష్టం చేశారు.
బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాలతో మమత భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పీఠం కోసం ప్రతిపక్షాల మధ్య ఎలాంటి పెనుగులాట లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించాక, అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కోల్ కతాలో ఆగస్టు 11న జరిగే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా, మమతల మధ్య మాటల యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేసినా ర్యాలీలో పాల్గొంటానని షా స్పష్టం చేయడంతో చివరికి పోలీసులు అనుమతి ఇచ్చారు.