Telugudesam: టీడీపీ నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది: సీపీఎం మధు
- ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
- ఏపీలో బలవంతపు భూసేకరణను సహించం
- మరో వారం రోజుల్లో విజయవాడలో సమావేశమవుతాం
తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో వామపక్ష పార్టీల నేతలు ఈరోజు సమావేశమయ్యారు. అనంతరం, మీడియాతో మధు మాట్లాడుతూ, రైతులు, కార్మికులు, యువతకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
బలవంతపు భూసేకరణ రాష్ట్రంలో ఎక్కడ జరిపినా రైతుల పక్షాన నిలబడి అన్నింటికి తెగబడి పోరాటం చేస్తామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి వామపక్షాలు చేసిన ప్రజా పోరాటాలపై ప్రజల్లో స్పందన అద్భుతంగా ఉందని చెప్పారు. మరో వారం రోజుల్లో విజయవాడలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, గిరిజన యూనివర్సిటీ, అనంతపురం యూనివర్సిటీ, కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్ అంశాలపై ఏ విధంగా పోరాటం చేయాలో విజయవాడలో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు.