Chandrababu: నిరుద్యోగ భృతిపై హర్షం.. చంద్రబాబు, లోకేశ్ కటౌట్లకు పాలాభిషేకం!
- నిరుద్యోగులకు భృతి కల్పిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం
- సర్వత్ర హర్షాతిరేకాలు
- తెలుగు యువత ఆధ్వర్యంలో సంబరాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ కటౌట్లకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగులకు భృతి చెల్లించాలని గురువారం ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఈ విషయం ప్రకటించిన వెంటనే నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
తెలుగు యువత నేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో విజయవాడలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు అండగా నిలిచారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ పేర్కొన్నారు.
కాగా, ‘ముఖ్యమంత్రి యువనేస్తం' పథకానికి ఈ నెలాఖరుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 22-35 ఏళ్లలోపు 12.26 లక్షల మంది నిరుద్యోగ యువతకు భృతి వర్తిస్తుంది. ఇందులో భాగంగా నెలకు రూ.1000 చొప్పున భృతి లభిస్తుంది.