Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్.. అసోం టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడి సహా ముగ్గురి రాజీనామా!
- మమతకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత
- ఎన్ఆర్సీపై మమతకు అవగాహన లేదన్న ద్వీపెన్ పాఠక్
- సీఎం వ్యాఖ్యలతో విభేదిస్తున్నామన్న నేతలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఎన్ఆర్సీ (జాతీయ పౌర రిజిస్టర్) అంశం విషయంలో కేంద్రంతో తలపడుతున్న ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్ఆర్సీపై మమత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ అసోం టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు ద్వీపెన్ పాఠక్, మరో ఇద్దరు నేతలు దిజంత సైకియా, ప్రదీప్ పచోని తమ పదవులకు రాజీనామా చేశారు.
మమత మాటలు తమను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తామెంత మాత్రమూ అంగీకరించబోమని పాఠక్ తేల్చి చెప్పారు. నిజానికి అసోంలో ఏం జరుగుతోందో ఆమెకు తెలియదని విమర్శించారు. ఎన్ఆర్సీపై అవగాహన లేకుండా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మమతపై దుమ్మెత్తిపోశారు. ఇక్కడ బయటకు కనిపిస్తున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరని ఆయన పేర్కొన్నారు.
ఎన్ఆర్సీ ముసాయిదాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంపై మమత తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని మమత పేర్కొన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.