Venkaiah Naidu: రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిపై ప్రతిపక్షాల ఫిర్యాదు యత్నం!
- సభలో పక్షపాతం చూపిస్తున్నారంటూ వెంకయ్యపై ఆరోపణ
- తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న నేతలు
- లేఖపై సంతకాల సేకరణ
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై ఆయనకే ఫిర్యాదు చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. తమ ప్రసంగాలను పదే పదే అడ్డుకోవడంతోపాటు సభా కార్యకలాపాలను నిష్పాక్షికంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నేతలు ఆయనకు లేఖ రాయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులతో రాజ్యసభకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చించారు.
సభలో మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని, మాట్లాడినప్పుడు పదేపదే అడ్డు తగులుతున్నారని, రాజ్యసభ టీవీని అధికార పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు వెంకయ్యపై ఆరోపణలు గుప్పిస్తూ లేఖ తయారుచేశారు. సభ్యుల సంతకాల సేకరణ పూర్తయిన అనంతరం దానిని వెంకయ్యనాయుడికి పంపనున్నారు.