Helmet: హెల్మెట్ లేకుంటే పెట్రోలు బంద్.. త్వరలో పెట్రోలియం శాఖ ఆదేశాలు!
- జైళ్ల శాఖ ఆధ్వరంలో 13 పెట్రోలు బంకులు
- నో హెల్మెట్-నో పెట్రోల్ నిబంధన అమలు
- అన్ని బంకుల్లోనూ నిబంధన అమలు చేయాలన్న జైళ్ల శాఖ డీజీ
హెల్మెట్ ధరించని వాహనదారులకు ఇక పెట్రోలు దొరకడం గగనమే. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోలు పోయవద్దన్న ఆదేశాలు జారీ చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ పెట్రోలియం శాఖను కోరారు. గురువారం ఆయన పెట్రోలియం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధిక మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారి మరణాలకు ప్రధాన కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడమేనని అన్నారు.
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13 పెట్రోలు బంకుల్లో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధన అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు బంకులు సైతం ఈ నిబంధనను తమ సామాజిక బాధ్యతగా గుర్తించి అమలు చేయాలని కోరారు. అలాగే, నో హెల్మెట్-నో పెట్రోల్ అమలు చేయాలంటూ ప్రైవేటు పెట్రోలు బంకు యజమానులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని పెట్రోలియం శాఖను కోరారు. డీజీ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్టు పెట్రోలియం శాఖ తెలిపింది. అంటే త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది.