TeamIndia: ఇంగ్లండ్‌లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ!
- తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ
- ఇంగ్లండ్ గడ్డపై విరాట్‌కు ఇదే తొలి శతకం
- టెస్టు కెప్టెన్‌గా 15వది
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసిన కోహ్లీ ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఇది 22వది. అంతేకాదు, టెస్ట్ కెప్టెన్‌గా సాధించిన 15వ సెంచరీ. కెప్టెన్లుగా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (25), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్(19) ఉన్నారు. ఇప్పుడు 15 సెంచరీలతో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ సాధించిన అంతర్జాతీయ శతకాల సంఖ్య 57కు చేరుకుంది.
ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్ శామ్ కర్రన్ ధాటికి భారత బ్యాట్స్‌మన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ సమయోచితంగా ఆడుతూ జట్టు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించి జట్టు పరువు కాపాడాడు. మొత్తం 225 బంతులు ఎదుర్కొన్న విరాట్ 22 ఫోర్లు, సిక్సర్‌తో 149 పరుగులు చేశాడు. అయితే, కోహ్లీకి అండగా నిలిచేవారు కరువయ్యారు. దీంతో భారత్ 274 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.