Tirumala: నవంబర్ ఆన్ లైన్ కోటా సేవా టికెట్లు విడుదల... రెండు గంటల్లో సగం కల్యాణోత్సవ టికెట్లు ఖాళీ!
- మొత్తం 67,567 సేవా టికెట్లు విడుదల
- ఆన్ లైన్ డిప్ విధానంలో 10,767 టికెట్లు
- జనరల్ కేటగిరీలో 56,800 టికెట్లు
నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ ఉదయం విడుదల చేసింది. మొత్తం 67,567 టికెట్లను విడుదల చేసిన టీటీడీ, వాటిల్లో 10,767 టికెట్లను ఆన్ లైన్ డిప్ విధానంలో భక్తులకు పంచుతామని పేర్కొంది. మిగతా టికెట్లను ఎప్పటిలా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్ లైన్ డిప్ లో భాగంగా సుప్రభాతం 7,512, తోమాల, అష్టదళపాద పద్మారాధన 180 చొప్పున, నిజపాద దర్శనం 2875, అర్చన 200 టికెట్లను విడుదల చేశామని టీటీడీ పేర్కొంది.
జనరల్ కేటగిరిలో మొత్తం 56,800 సేవాటికెట్లను అందుబాటులో ఉంచామని, వీటిల్లో విశేషపూజ 2000, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4050 టికెట్లు, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 14,300 టికెట్లు విడుదల చేశామని తెలిపారు. కాగా, ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో సేవా టికెట్లు విడుదల కాగా, కల్యాణోత్సవం టికెట్లు హాట్ కేక్ లా మారాయి. రెండు గంటల వ్యవధిలోనే సగం టికెట్లు ఖాళీ అయ్యాయి. వారాంతాలతో పాటు సోమవారానికి సంబంధించిన కల్యాణం టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ప్రస్తుతం నవంబర్ 8, 13, 15, 16, 20, 21, 22, 26, 27, 28, 29, 30 తేదీలకు సంబంధించిన టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు 'టీటీడీ సేవా ఆన్ లైన్' వెబ్ సైట్ చూపిస్తోంది.