mamatha banerjee: మమతా బెనర్జీ ఓ ఊసరవెల్లి.. ఊహకు అందని రాజకీయవేత్త: బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ రంజన్ చౌదరి
- ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రతిపక్షాలను విడదీస్తున్నారు
- బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు
- కాంగ్రెస్ నేతలను జైళ్లలో పెడుతున్నారు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెను ఊసరవెల్లితో పోల్చారు. ఐకమత్యంగా ఉన్న ప్రతిపక్షాలను చీల్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రతిపక్షాలను విడదీస్తున్నారని, ఆమెను ఎవరూ నమ్మవద్దని కోరారు. ఆమెకు ప్రధాని కావాలనే కోరిక ఉందని అన్నారు. ఓవైపు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరుతూ, మరోవైపు పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మమత నమ్మదగిన వ్యక్తి కాదని, ఊహకు అందని రాజకీయవేత్త అని రంజన్ చౌదరి విమర్శించారు. కాంగ్రెస్ నేతలను ఎన్నికల్లో నిలబడకుండా చేసేందుకు యత్నిస్తున్నారని, జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షాలను ఏకం చేయాలని యత్నిస్తుంటే, మమత మాత్రం విడదీసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.