aadhaar: ఫోన్లలో డిఫాల్ట్ గా ఆధార్ టోల్ ఫ్రీ.. తమకు సంబంధం లేదన్న యూఐడీఏఐ!
- ఆటో మేటిక్ గా నంబర్ అప్ డేట్
- ఎలా జరిగిందో చెప్పాలని హ్యాకర్ ప్రశ్న
- తమ చర్య కాదన్న యూఐడీఏఐ
ఆధార్ భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దేశంలోని చాలామంది ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యూజర్ల ఫోన్లలో నిన్న, ఈ రోజు ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ డీఫాల్ట్ గా రావడం కలకలం రేపింది. తాము ఫీడ్ చేయకుండానే 1800-300-1947 టోల్ ఫ్రీ నంబర్ తమ కాంటాక్ట్ లిస్ట్ లోకి చేరిపోవడంపై పలువురు యూజర్లు విస్మయం వ్యక్తం చేశారు. మరికొన్ని ఫోన్లలో పాత టోల్ ఫ్రీ నంబర్ 1947కు బదులుగా ఈ కొత్త నంబర్ ఆటోమేటిక్ గా అప్ డేట్ అయిపోయింది.
తమ అనుమతి లేకుండా తమ ఫోన్లలో మరెవరో ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ ను ఫీడ్ చేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. కాగా, ఈ విషయాన్ని తొలుత గుర్తించిన ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఇలియట్ అల్టర్సన్ స్పందిస్తూ.. ‘వేర్వేరు సర్వీస్ ప్రొవైడర్ల సేవలు పొందుతూ అధార్ ఉన్నవారు, లేనివారు, ఆధార్ మొబైల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నవారు, చేసుకోనివారు.. ఇలా అందరి ఫోన్లలో వాళ్లకు తెలియకుండానే ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ డీఫాల్ట్ గా చేరిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో చెప్పగలరా?’ అని ఆధార్ కార్డుల్ని జారీచేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)ని ట్విట్టర్ లో ప్రశ్నించాడు.
మాకు సంబంధం లేదు: యూఐడీఏఐ
ఈ ఆటోమేటిక్ అప్ డేట్ వ్యవహారంపై ఇలియట్ తో పాటు పలువురు అడుగుతున్న ప్రశ్నలకు యూఐడీఏఐ స్పందించింది. ఈ నంబర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదనీ, కస్టమర్ల ఫోన్లలోకి ఈ నంబర్ ను చేర్చాల్సిందిగా తాము ఏ సర్వీస్ ప్రొవైడర్ నూ కోరలేదని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఆధార్ అధికారిక టోల్ ఫ్రీ నంబర్ 1947 గానే ఉందనీ, దీన్ని మార్చలేదని తేల్చిచెప్పింది. కొందరు వ్యక్తులు దురుద్దేశంతో ఫోన్ వినియోగదారులను తికమక పెట్టేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో టెలికాం కంపెనీలు ఇంతవరకూ నోరు మెదపలేదు.