Yadadri Bhuvanagiri District: 'యాదాద్రి పాపపు కూపం' గురించి నమ్మలేని పచ్చి నిజాలివి!
- చిన్నారులకు నిత్యం నరకం
- ఏడేళ్ల వయసులోనే చూడకూడనిదంతా చూపించేస్తున్న వైనం
- మాట వినకుంటే వాతలు, పస్తులు
- బాలికలు చెప్పిన మాటలు విని విలపించిన మహిళా ఉద్యోగులు
వారికి ప్రత్యక్ష నరకం అంటే ఏంటో భూమ్మీదనే చూపిస్తారు. ఈ జీవితం అంటే ఇంతేనేమో అన్న భావన వచ్చేలా చేస్తారు. ఎంతమంది వచ్చినా వారి చేతుల్లో నలగడమే తమ పనని, అదేమీ తప్పు కాదన్న భావనను వారిలో కలిగిస్తారు. ఒకవేళ ఎదురు తిరిగి ప్రశ్నిస్తే, ఒళ్లంతా వాతలు, పస్తులు పెడతారు. చిగుళ్ల వరకూ గోళ్లను కత్తిరించి హింసిస్తారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న యాదగిరి గుట్టలో జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపిన తరువాత వెలుగుచూసిన పచ్చి నిజాలివి. తాము కిడ్నాప్ చేసి తెచ్చిన బాలికలను మధ్యవర్తులు వ్యభిచార గృహాలకు అప్పగించిన తరువాత వారు ఎన్నో బాధలను అనుభవించేలా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ఐదేళ్ల వయసులోనే బట్టలు ఉతుకుతూ, ఇంటి పనంతా చేస్తూ, రాత్రయితే ఓ జంట వ్యభిచారం చేస్తుంటే, వారి ముందు కూర్చుని జరుగుతున్న ఘోరాన్ని చూస్తూ ఉండాల్సి వుంటుందన్న నమ్మలేని నిజాన్ని ఓ బాలిక కళ్లకు కట్టినట్టు చెబుతుంటే దిగ్భ్రాంతి చెందామని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తనకు నిద్రవచ్చి కళ్లు మూసుకుపోతే ఎర్రగా కాల్చిన ఇనుపచువ్వతో వాత పెట్టారని ఏడేళ్ల బాలిక చెప్పిన విషయాన్ని మీడియాకు వెల్లడించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ కాలుస్తారేమోనన్న భయంతో తాను అక్కడ జరుగుతున్నది రోజూ చూశానని ఆ పాప బావురుమంటే దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
ఇక ఇక్కడి వ్యభిచార గృహాల్లో ఆడ పిల్లలకు ఏడు, ఎనిమిది ఏళ్ల వయసు రాగానే వ్యభిచారంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారట. రాత్రంతా మెలకువగా ఉండేలా చేయడం, శారీరకంగా సిద్ధం కావడానికి హార్మోన్ ఇంజక్షన్లు, వ్యభిచారం ఏ మాత్రం తప్పు కాదన్న అభిప్రాయం వచ్చేలా పదే పదే అడల్ట్ సినిమాలు చూపించి, ప్రత్యక్షంగా గదుల్లో కూర్చోబెట్టడం వంటి పనులు చేసేవారని ఓ మహిళా అధికారిణి వెల్లడించింది. ఇక్కడ పట్టుబడిన చిన్నారులతో మాట్లాడుతూ ఉంటే, చేయని తప్పుకు వారు అనుభవించిన నరకం మరెక్కడా ఉండదనిపించిందని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల ఈ దందా బయటపడి 15 మంది బాలికలను పోలీసులు రక్షించిన తరువాత, 110 కుటుంబాలు చిన్నారులను తీసుకుని పారిపోయాయని పోలీసులు భావిస్తున్నారు. దాడులు ప్రారంభం కాగానే వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి వాట్స్ యాప్ గ్రూపులోకి ఈ సమాచారం చేరిపోగా, ఇళ్లకు తాళాలు వేసి వారు పారిపోయినట్టు తెలుస్తోంది. గుట్టలోని పాత నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇప్పుడు ఎన్నో ఇళ్లు తాళాలు వేసి కనిపిస్తుండగా, వారందరినీ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో దందా సాగుతుండగా, దీన్ని నిలువరించేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, అధికారులు మారగానే, ఆ ప్రయత్నాలు ఆగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ సెక్స్ రాకెట్ కు కొంతమంది పోలీసుల అండదండలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ డీజిల్ ఖర్చులను వ్యభిచార గృహాల నిర్వాహకులే భరిస్తుండే వాళ్లన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే, వారిని బెదిరింపులకు గురి చేయడం ఇక్కడ సర్వ సాధారణమని ప్రజలు చెబుతున్నారు. ఈ మొత్తం దందా కొత్తగా ఇప్పుడే బయటకు వచ్చినట్టు చెప్పుకుంటుండటం తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఇక్కడి ప్రజలు అంటుండటం గమనార్హం.