Kurnool District: కర్నూలు జిల్లా క్వారీలో ఇంత భారీ పేలుడుకు అసలు కారణమిది!
- తొలుత గ్యాస్ సిలిండర్ లీకై మంటలు
- ఒకేసారి పేలిన మూడు వందల ఎలక్ట్రికల్ డిటొనేటర్లు
- కిలోల కొద్దీ గన్ పౌడర్ కు అంటుకున్న మంటలతోనే పెను ప్రమాదం
కర్నూలు జిల్లాలోని క్వారీలో జరిగిన భారీ పేలుడు తరువాత మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. మరో నలుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. క్వారీలో ఇంత భారీ పేలుడుకు కారణాన్ని పోలీసులు కనుగొన్నారు. సాధారణంగా బండరాళ్లను పేల్చేందుకు వినియోగించే డిటొనేటర్లు ఒకదాని తరువాత ఒకటి పేలుతుంటాయి. పేలుడు జరిగే ప్రాంతానికి దూరంగా వెళితే ఎటువంటి ప్రమాదమూ ఉండదు. కానీ ఈ క్వారీలో జరిగింది వేరు. రాళ్లను ముక్కలు చేసేందుకు తెచ్చిన పేలుడు పదార్థాలను ఆ ప్రాంతంలో భారీగా నిల్వ ఉంచారు. మూడు వందలకు పైగా ఎలక్ట్రికల్ డిటొనేటర్లు, కిలోల కొద్దీ గన్ పౌడర్, సెమీ ఎక్స్ ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్ అక్కడ ఉన్నాయి.
ఈ క్వారీలో ఇటీవల కొన్ని చోట్ల పేలుళ్లు జరుపగా, కొన్ని డిటొనేటర్లు, గన్ పౌడర్ పేలలేదు. వాటిని అక్కడి నుంచి క్వారీ యాజమాన్యం తొలగించలేదు. ఆపై నిన్న రాత్రి కూలీలు వంట నిమిత్తం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు డిటొనేటర్ల వైర్లకు అంటుకున్నాయి. ఆ సమయంలో ఏర్పడిన పేలుడుతో అప్పటికే గుంతల్లో అమర్చిన డిటొనేటర్లకూ మంటలు అంటుకుని, అవి కూడా పేలడం, గన్ పౌడర్ ఎగసిపడటంతో ప్రమాద తీవ్రత అత్యధికంగా ఉందని అధికారులు అంటున్నారు.