India: మేహుల్ చౌక్సీని అప్పగించలేమన్న అంటిగ్వా... తన చేతులు కట్టేసి ఉన్నాయన్న ప్రధాని గాస్టన్ బ్రౌనే!
- ఇండియా నుంచి పారిపోయిన మేహుల్ చౌక్సీ
- అంటిగ్వా పౌరసత్వం తీసుకుని దర్జాగా విదేశాల్లో
- తమ పౌరుడిని అప్పగించలేమన్న ప్రభుత్వం
భారత విదేశాంగ శాఖ, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి క్లీన్ చిట్ వచ్చిన తరువాతే తాము మేహుల్ చౌక్సీకి పౌరసత్వం ఇచ్చామని, ప్రస్తుతం తమ చట్టాల రక్షణలో ఆయన ఉన్నారని, తమ దేశ పౌరుడు కాబట్టి ఆయన్ను దేశం నుంచి బయటకు పంపించలేమని అంటిగ్వా స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణంలో నీరవ్ మోదీతో పాటు మేహుల్ కూడా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.
తనకు పౌరసత్వం కావాలని 2017 మేలో చౌక్సీ దరఖాస్తు చేసుకోగా, ఆపై తాము విచారించి, అదే సంవత్సరం నవంబర్ లో పౌరసత్వం ఇచ్చామని అంటిగ్వా అండ్ బార్బుడా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ యూనిట్ ఓ సుదీర్ఘ ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. ఆయన పెట్టుబడుల పాలసీ కింద రూ. 1.30 కోట్లను చెల్లించాడని, ఈ సంవత్సరం జనవరి 15న అంటిగ్వా పౌరుడిగా విధేయతా ప్రమాణం కూడా చేశాడని పేర్కొంది. ఆపై 19 రోజుల తరువాత జనవరి 29న మేహుల్ చౌక్సీపై కేసు నమోదైందని గుర్తు చేసింది. తమ పౌరుడు కాబట్టి ఆయన్ను పంపించలేమని, మంజూరైన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే అది చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా సాగాల్సి వుందని తెలిపింది.
ఈ విషయంలో భారత్ నుంచి వచ్చిన విజ్ఞప్తులపై స్పందించిన అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనే, ఈ విషయంలో తన చేతులు కట్టేసి ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుండగా, ఎన్నో ఫిర్యాదులు ఉండగా, క్లీన్ చిట్ ఎలా ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశం విడిచి పారిపోతున్న దోపిడీదారుల పట్ల మోదీ ప్రభుత్వ తీరును ఈ ఘటన తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. గడచిన.ఏప్రిల్ లో అంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనేని మోదీ కలిశారని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.