WHO: స్వచ్ఛ భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసల జల్లు.. ఏడాదికి మూడు లక్షల మంది చిన్నారులను కాపాడుతోందన్న డబ్ల్యూహెచ్‌వో!
- వచ్చే ఏడాది అక్టోబరుతో ముగియనున్న స్వచ్ఛ భారత్
- ఇదే జోరుతో కొనసాగితే అద్భుతాలు జరుగుతాయన్న డబ్ల్యూహెచ్‌వో
- 2014లో మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన మిషన్
ప్రధాని నరేంద్రమోదీ మానసపుత్రిక స్వచ్ఛభారత్ మిషన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసల వర్షం కురిపించింది. భారత్ ఇదే స్ఫూర్తితో ముందుకెళితే ఆరోగ్యవంతమైన భారతావని నిర్మితమవుతుందని పేర్కొంది. వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఇదే జోరు కొనసాగించగలిగితే అద్భుతాలు ఖాయమని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేసింది.
దీని ప్రకారం.. భారత్‌లో బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించగలిగితే ఏటా 3 లక్షల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడినట్టు అవుతుందని పేర్కొంది. ఫలితంగా 14 మిలియన్ సంవత్సరాల ఆరోగ్యవంతమైన జీవితం అందుతుందని అంచనా వేసింది. 2014కు ముందు స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభం కావడానికి ముందు ప్రతి ఏడాది 199 మిలియన్ డయేరియా కేసులు నమోదయ్యేవని పేర్కొంది. 2016-18 మధ్య గృహ పారిశుద్ధ్యం ఏడాదికి 13 చొప్పున ఎగబాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. .
అక్టోబరు 2, 2014లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్చ భారత్ పథకం ఓ ఉద్యమంలా సాగింది. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల గ్రామాల్లో బహిరంగ విసర్జన దాదాపు కనుమరుగైంది. ఎన్నో రాష్ట్రాలు ‘ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ’ రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి. 2019 నాటికి దేశవ్యాప్తంగా బహిరంగ విసర్జన నిర్మూలనే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ మిషన్‌పై డబ్ల్యూహెచ్‌లో తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నిర్దేశించిన సమయం వరకు ఇదే స్ఫూర్తితో, ఇదే జోరుతో మిషన్ కొనసాగితే ఏకంగా 14 మిలియన్ సంవత్సరాల ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని పేర్కొనడం విశేషం.