Hyderabad: స్కూటర్ కు రూ.63 వేల జరిమానా.. తెలివిగా స్పందించిన యజమాని!
- రాచనగరి ప్రాంతంలో పోలీసుల తనిఖీలు
- ఓ స్కూటర్ కు రూ.63,500 చలానా
- నగదుకు బదులు బండినే ఇచ్చేసిన యజమాని
సాధారణంగా మన బైక్ లేదా స్కూటర్ పై ఫైన్ పడగానే కంగారు పడిపోతాం. చలానాలు నిర్ణీత మొత్తం దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనని భయపడతాం. కానీ, మైసూర్ లోని రాచనగరి ప్రాంతంలో ఇందుకు భిన్నమైన, ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది.
రాచనగరి ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేఏ09హెచ్ డీ 4732 నంబర్ ఉన్న స్కూటర్ ను పోలీసులు గుర్తించారు. రికార్డులు పరిశీలించగా, ఈ స్కూటర్ పై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 635 కేసులు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. మొత్తం జరిమానాలను లెక్కించి రూ.63,500 కట్టాల్సిందిగా బండి యజమానికి చలానా ఇచ్చారు.
అయితే విషయం ఇక్కడితో ముగిసిపోలేదు. అసలు కంటే కొసరే ఎక్కువయిందన్నట్లు స్కూటర్ ఖరీదు కంటే జరిమానా మొత్తం ఎక్కువ కావడంతో సదరు యజమాని తెలివిగా స్పందించాడు. తాను ఈ స్కూటర్ అమ్మేసినా రూ.63,500 కట్టలేననీ, కాబట్టి ఈ బండిని మీరే ఉంచుకోండని పోలీసులకు ఇచ్చేసి, ఎంచక్కా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. దీంతో నివ్వెరపోవడం పోలీసుల వంతయింది.