kcr: మోదీతో 45 నిమిషాల పాటు కేసీఆర్ ఏకాంత సమావేశం!
- ముగిసిన మోదీ, కేసీఆర్ ల భేటీ
- 11 వినతి పత్రాలను అందించిన ముఖ్యమంత్రి
- కొత్త జోన్లకు ఆమోదముద్ర వేయాలంటూ విన్నపం
భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. సమావేశం సందర్భంగా ప్రధానికి 11 వినతి పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని... కొత్త జోన్ల విధానానికి ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా మోదీని కేసీఆర్ కోరారు.
దీనికి తోడు కొత్త సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన బైసన్ పోలో మైదానాన్ని ఇవ్వాలని విన్నవించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ, రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని వినతి పత్రాలలో కోరారు.
కాగా, ఇరువురు నేతలు 45 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.