jalagam prasadarao: కాంగ్రెస్లోకి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు.. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్!
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై జలగంపై వేటు
- రెండు దశాబ్దాలుగా పార్టీ కార్యకలాపాలకు దూరం
- రాహుల్ సమక్షంలో చేరికకు రంగం సిద్ధం
మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్తలకు ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దాదాపు 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఆయన తిరిగి పార్టీలో చేరబోతున్నారు. ఆయన చేరికకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదింపుల కమిటీ ప్రసాదరావు చేరికకు ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయన తిరిగి పార్టీలో చేరడం ఖాయమైంది.
కుంతియా సమక్షంలో జరిగిన సంప్రదింపుల కమిటీ సమావేశంలో పార్టీలో చేరేందుకు ఎవరైనా బేషరతుగా ముందుకొస్తే చేర్చుకోవాలని నిర్ణయించారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గతంలో జలగం ప్రసాదరావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఫలితంగా రెండు దశాబ్దాలపాటు ఆయన పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం మళ్లీ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఆయనను క్రియాశీలకం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ప్రసాదరావు కాంగ్రెస్లో చేరనున్నట్టు ఆయన వర్గీయులు తెలిపారు. ఆయన ఎప్పుడు చేరేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.