Chandrayaan-2: ‘మూన్ మిషన్’లో పోటీపడుతున్న భారత్-ఇజ్రాయెల్.. డిసెంబరుకు మారిన చంద్రయాన్-2 ప్రయోగం!
- ఒకేసారి ప్రారంభం కానున్న భారత్, ఇజ్రాయెల్ మూన్ మిషన్లు
- ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇస్రో
- చంద్రయాన్-2లోని ప్రతీ వస్తువూ దేశీయంగా తయారైనదే
భారత్ చేపట్టిన మూన్ మిషన్‌కు ఇజ్రాయెల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగానికి భారత్ సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ కూడా చంద్రుడిపైకి ఉపగ్రహం పంపించే పనిలో బిజీగా ఉంది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ యుద్ధంలో గెలవడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో నాలుగో శక్తిగా ఎదగాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
నిజానికి భారత్ ఏప్రిల్ 23 చంద్రయాన్-2ను ప్రయోగించాల్సి ఉండగా, తర్వాత దానిని అక్టోబరు మొదటి వారానికి మార్చారు. ఇప్పుడు మరోమారు దీనిని డిసెంబరుకు మార్చారు. ఇజ్రాయెల్ కూడా డిసెంబరులోనే మూన్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తుండడంతో ఇరు దేశాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపగా ఇప్పుడు నాలుగో స్థానం కోసం భారత్, ఇజ్రాయెల్ పోటీపడుతున్నాయి.
2008లో భారత్ చేపట్టిన చంద్రయాన్ -1 మిషన్ కంటే చంద్రయాన్-2 మిషన్ చాలా క్లిష్టమైనది. చంద్రయాన్ 1 ప్రయోగంలో కేవలం ఆర్బిటర్ ను మాత్రమే పంపించడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఓ ల్యాండర్, రోవర్ కూడా ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉపగ్రహం ల్యాండైన అనంతరం రోవర్ బయటికి వచ్చి పరిశోధనలు చేస్తుంది. ఈ ప్రయోగం విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భావిస్తోంది. ఈ మిషన్‌ను చాలెంజింగ్‌గా తీసుకుని నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంలో రెండు ఉపగ్రహ ప్రయోగాలు విఫలం కావడంతో ఇస్రో ఈ మిషన్‌పై పట్టుదలగా పనిచేస్తోంది. కాగా, చంద్రయాన్-2లో ఉపయోగించిన ప్రతీ వస్తువు దేశీయంగా తయారైనదే కావడం ఈ మిషన్‌లోని మరో ప్రత్యేకత.
మరోవైపు భారత్‌కు పోటీగా ఇజ్రాయెల్ స్పేస్ఐఎల్-ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీ కలిసి ఈ ఏడాది చివరి నాటికి మూన్ మిషన్‌ను ప్రయోగించాలని యోచిస్తోంది. ప్రైవేటు అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 1300 పౌండ్ల బరువైన ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ పోటీలో గెలుపెవరిదో తెలియాలంటే డిసెంబరు వరకు ఆగాల్సిందే.