Supreme Court: ఆర్టికల్ 35ఏను తాకితే కశ్మీర్ లో రణరంగమే.. హెచ్చరించిన నిఘా వర్గాలు!
- పోలీసులు సైతం తిరుగుబాటు చేస్తారని హెచ్చరిక
- అక్టోబర్ వరకు విచారణ వద్దని సుప్రీంను కోరిన గవర్నర్
- పిటిషన్ దాఖలు చేసిన ఎన్జీవో
జన్మతః కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు, విశేషాధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే కశ్మీర్ రణరంగమవుతుందని నిఘా వర్గాలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇదే జరిగితే పోలీసులు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నాయి. కేంద్రం1954లో రాజ్యాంగంలో చేర్చిన ఈ ఆర్టికల్ ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులెవరూ కశ్మీర్లో స్థిరనివాసం ఏర్పరచుకోవడం కానీ, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ సాధ్యం కాదు. దీన్ని సవాలు చేస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భారత రాజ్యాంగం ప్రకారం పౌరులు దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చని కోర్టులో వాదించింది. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఒకవేళ ఆర్టికల్ 35ఏ ను న్యాయస్థానం కొట్టేస్తే.. కశ్మీర్ లో ఇన్నాళ్లు ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లకు అండగా ఉన్న పోలీసులు సైతం తిరుగుబాటు చేస్తారని నిఘా వర్గాలు చెప్పాయి. దీంతో ఈ విషయంలో విచారణను అక్టోబర్ లో పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవరకూ నిలిపివేయాలని సుప్రీంకోర్టుకు జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు సుప్రీంకోర్టులో సోమవారం జరగనున్న విచారణను నిరసిస్తూ కశ్మీర్ లో వేర్పాటువాదులు, నేతలు ఈ రోజు, రేపు బంద్ కు పిలుపునిచ్చారు.