air india: వెంటనే విధుల్లో చేరమంటూ మాజీ ఉద్యోగులకు, చనిపోయిన సిబ్బందికి ఎయిర్ ఇండియా మెయిల్స్.. తర్వాత నాలుక్కరచుకున్న సంస్థ!

  • మాజీ ఉద్యోగులకు సందేశాలు, మెయిల్స్
  • కంపెనీని సంప్రదించిన మాజీ సిబ్బంది
  • తప్పును సరిదిద్దుకున్న ఎయిర్ ఇండియా

ఏ కంపెనీ అయినా నష్టాలొస్తే ఏం చేస్తుంది? అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటుంది. ఇంకా కావాలంటే, తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఉద్యోగుల్ని కూడా తొలగిస్తుంది. అయితే ఎయిర్ ఇండియా మాత్రం డిఫరెంట్. భారీ నష్టాలతో సతమతమవుతున్న ఈ సంస్థ ఇటీవల మాజీ ఉద్యోగులకు విధుల్లో చేరాలని ఈ-మెయిల్స్ పంపింది. దీంతో విస్తుపోయిన మాజీ ఉద్యోగులు ఎయిరిండియా ఆఫీస్ ను సంప్రదించారు. చివరికి సాంకేతిక సమస్య కారణంగా ఈ తప్పు జరిగిందని గుర్తించిన అధికారులు సరిదిద్దారు.

ఎయిరిండియాలో ప్రస్తుతం ఆటోమేటెడ్ క్రూ మేనేజ్ మెంట్ సిస్టమ్(సీఎంఎస్) వాడుతున్నారు. అయితే గతంలో వాడిన పాత సీఎంఎస్ ను ఇటీవల పొరపాటున యాక్టివేట్ చేయడంతో అసలు సమస్య మొదలైంది. దీంతో కంప్యూటర్ లో ఉన్న మాజీ ఉద్యోగుల ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లకు విధుల్లో చేరాలంటూ సీఎంఎస్ సందేశాలు పంపింది. అంతేకాకుండా ఏయే షెడ్యూల్స్ లో ఏయే విమానాలు వెళుతున్నాయో మాజీ పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లకు వివరాలు అందించింది. విచిత్రం ఏమిటంటే, చనిపోయిన ఉద్యోగులకు కూడా మెయిల్స్ వెళ్లాయి. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు సంస్థ ఆఫీస్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. దీంతో ఎయిర్ఇండియా నాలుక్కరచుకుని, వెంటనే లోపాన్ని సరిదిద్దింది.

  • Loading...

More Telugu News