Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 82 మందికిపైగా మృతి.. సునామీ హెచ్చరికలు జారీ!
- ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం
- హాహాకారాలు చేస్తూ జనాల పరుగులు
- వారం వ్యవధిలో రెండో భూకంపం
ఆదివారం సాయంత్రం ఇండోనేషియాను భారీ భూకంపం ఒక్కసారిగా కుదిపేసింది. బాలి సమీపంలోని లాంబాక్ దీవుల్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైంది. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 82 మంది మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. ప్రజలు బయటకొచ్చి హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తినష్టంపై స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
లాంబాక్ దీవుల్లోని భూగర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. మరోవైపు, ఈ భూకంపం ధాటికి సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదే ప్రాంతంలో గతవారం సంభవించిన భూకంపంలో 12 మందికిపైగా మృతి చెందారు. అంతలోనే మరో భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకృతి విపత్తు సంస్థ అధికార ప్రతినిధి ఇప్పటి వరకు 82 మరణించినట్టు చెబుతుండగా, అధికారులు మాత్రం 39 మంది మాత్రమేనని చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.