Madras high court: రైతుగా మారిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి.. వ్యవసాయం నిజమైన వృత్తి అంటున్న జస్టిస్!
- ఈ ఏడాది ఏప్రిల్‌లో విధుల నుంచి రిటైర్మెంట్
- స్వగ్రామం చేరుకుని వ్యవసాయం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ.సెల్వానికి చెందిన రెండు వీడియోలు ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి. టీషర్టు-నిక్కరు ధరించి, తలకు తువ్వాలును పాగాగా చుట్టుకున్న ఆయన ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నారు. షర్టుపై బురద కూడా ఉంది. పొలం దున్నుతున్న ఆయనను తొలుత ఎవరూ పోల్చుకోలేకపోయారు. తర్వాత తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
62 ఏళ్ల సెల్వం విధుల నుంచి రిటైరయ్యాక శివగంగ జిల్లాలోని తన స్వగ్రామమైన పులన్‌కురిచ్చి చేరుకున్నారు. అనంతరం తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయంలోకి దిగిపోయారు. ‘‘ప్రస్తుతం రిటైరైన న్యాయమూర్తులు ఏదో ఒక పనిలో కుదిరిపోతున్నారు. కమిషన్లు, ట్రైబ్యునళ్లలో మెంబరుగా చేరిపోతున్నారు. కానీ 13 ఏళ్లపాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సెల్వం మాత్రం పొలం పనులు చేసుకుంటున్నారు’’ అంటూ సోషల్ మీడియాలో ఆయనను ప్రశంసిస్తూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో ఆయనకు వస్తున్న ప్రశంసల గురించి సెల్వం వద్ద ప్రస్తావించినప్పుడు నవ్వేశారు. వ్యవసాయం తన నిజమైన వృత్తి అని పేర్కొన్నారు. తిరిగి దానిని కొనసాగించడానికి తాను సిగ్గుపడడం లేదన్నారు. సెల్వం కుటుంబ సభ్యులు రైతులే. వందేళ్లుగా వారిది వ్యవసాయమే వృత్తి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన ఆయన తన స్వగ్రామానికి చేరుకుని ఉన్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు.