bandh: రేపు దేశ వ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాల సమ్మె
- దేశ వ్యాప్తంగా స్తంభించనున్న రవాణా వ్యవస్థ
- ఆర్టీసీలోని మెజార్టీ సంఘాలు, లారీ, ఆటో.. మద్దతు
- రేపు సికింద్రాబాద్ లో రైల్వే కార్మికుల బహిరంగ సభ
రేపు దేశ వ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. రహదారి భద్రత బిల్లు -2016ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రేపటి సమ్మెకు పిలుపు నిచ్చారు. సంబంధిత బిల్లును ఉపసంహరించడంతో పాటు కనీస వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మెకు ఆర్టీసీలోని మెజార్టీ సంఘాలు, లారీ, ఆటో, క్యాబ్, రైల్వే కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. దేశ వ్యాప్తంగా రేపు రవాణా వ్యవస్థ స్తంభించనుంది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోనున్నాయి.
కాగా, రేపు సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట రైల్వే కార్మికులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే, రేపు ఉదయం పదకొండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ఆటో డ్రైవర్ల ర్యాలీ, అనంతరం బహిరంగసభ నిర్వహించనున్నట్టు సమాచారం.