gvl: జీవీఎల్ పై నిప్పులు చెరిగిన మంత్రి యనమల!
- పీడీ అకౌంట్స్ అంటే ఏమిటో జీవీఎల్ కు తెలియదా?
- పీడీ ఖాతాల్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది?
- పీడీ ఖాతాలకు 2జీ కుంభకోణానికి పోలిక ఏమిటి?
జీవీఎల్ చేసిన ఆరోపణలపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పీడీ అకౌంట్స్ అంటే ఏమిటో జీవీఎల్ కు తెలియదా? పీడీ ఖాతాల్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఆర్థిక పరిజ్ఞానం కూడా లేకుండా రాజ్యసభలో జీవీఎల్ ఏం చర్చలు చేస్తారు? పీడీ ఖాతాలకు 2జీ కుంభకోణానికి పోలిక ఏమిటి? అంటూ జీవీఎల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 72,652 పీడీ ఖాతాలు నిర్వహించేవారని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు 43,374 పీడీ అకౌంట్లు వచ్చాయని అన్నారు. ఈ ఖాతాల్లో అత్యధికం పంచాయతీలు, స్థానిక సంస్థలకు చెందినవేనని, 13, 14 ఆర్థిక సంఘం నిధులను వేరుచేసేందుకు 13,199 పీడీ ఖాతాలు తెరిచామని, ఏజీ నివేదిక ప్రకారం మార్చి 31 నాటికి పీడీ ఖాతాల్లో రూ.29,909 కోట్లు ఉన్నాయని అన్నారు. పీడీ ఖాతాల్లో పారదర్శకత కోసం పోర్టల్ ప్రారంభించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,822 పీడీ అకౌంట్లు తొలగించామని, కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ, ట్రెజరీలో నిధులు ఉంచుతున్నామని స్పష్టం చేశారు.