Google: గూగుల్‌నే మెప్పించిన మనమ్మాయి.. ఏడాదికి రూ.1.20 కోట్ల వేతనంతో ఆఫర్!
- ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం గూగుల్ అన్వేషణ
- ఐదుగురిలో మనమ్మాయి స్నేహ ఒకరు
- ఆమె ప్రతిభకు గూగుల్ కూడా దాసోహం
తెలంగాణలోని వికారాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి కుడుగుంట స్నేహారెడ్డి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కారణం.. తమ సంస్థలో పనిచేసేందుకు గూగుల్ ఎంపిక చేసిన అత్యంత ప్రతిభావంతుల జాబితాలో ఆమె కూడా ఒకరు. మొత్తం ఐదుగురిని ఎంపిక చేసిన సెర్చింజన్ దిగ్గజం ఒక్కొక్కరికి రూ. 1.20 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన స్నేహారెడ్డి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది.
స్నేహారెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో మెరికే. పోటీ పరీక్షలకు హాజరైతే ర్యాంకు రావాల్సిందే. బీటెక్ పూర్తి చేసిన తర్వాత.. ‘నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్’ ప్రాజెక్టులో పనిచేసేందుకు గూగుల్ మెరికల్లాంటి యువత కోసం అన్వేషిస్తున్న విషయం తెలుసుకుని స్నేహారెడ్డి దరఖాస్తు చేసుకుంది. ఆన్లైన్లో జరిగిన తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక చిట్టచివరి పరీక్ష కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా, అదే సమయంలో మరో ముఖ్యమైన పరీక్ష ఉండడంతో వెళ్లలేకపోయింది.
అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన గూగుల్ ఆ ముఖ్యమైన పరీక్షను కూడా ఆన్లైన్లోనే నిర్వహించింది. అందులో ఎంపికైన స్నేహకు ఏడాదికి రూ.1.20 కోట్ల వేతనంతో ఉద్యోగానికి ఎంపిక చేసింది. తనకు ఫేస్‌బుక్‌తోపాటు మరిన్ని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా పరిశోధనలకు అవకాశం ఉంటుందనే గూగుల్‌ను ఎంచుకున్నట్టు స్నేహారెడ్డి తెలిపింది.