New Delhi: వ్యాపారులను బంధించి.. రూ.25 లక్షల విలువైన జుట్టు దొంగతనం!
- అన్నదమ్ములను తుపాకితో బెదిరించి దోపిడీ
- 230 కిలోల తలనీలాలు ఎత్తుకెళ్లిన వైనం
- ఇటీవల తిరుపతిలో తలనీలాలు కొనుగోలు చేసిన వ్యాపారులు
పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించే తలనీలాలు కొనుగోలు చేసే వ్యాపారిని తుపాకితో బెదిరించి రూ.25 లక్షల విలువైన జుట్టును దొంగిలించుకుపోయారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన జుట్టును స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని నాంగ్‌లోయీ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన చెందిన జహంగీర్, తాజుద్దీన్ సోదరులు. పుణ్యక్షేత్రాలు తిరుగుతూ భక్తులు సమర్పించే తలనీలాలను కొనుగోలు చేయడం వీరి వృత్తి. ఆ జుట్టుతో విగ్గులు వంటి వాటిని తయారుచేస్తుంటారు. ఇటీవల తిరుపతి నుంచి రూ.25 లక్షల విలువైన తలనీలాలను కొనుగోలు చేసి ఢిల్లీ తీసుకొచ్చారు.
తాజాగా ఇద్దరు దుండగులు వీరి వద్దకు వచ్చి తుపాకి చూపించి బెదిరించారు. ఇద్దరినీ తాళ్లతో కట్టేసి గదిలో పెట్టి బంధించారు. అనంతరం అక్కడ ఉన్న 230 కేజీల జుట్టు, రూ.30 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంగల్ సేన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ చోరీలో హస్తం ఉన్న మిగతా వారికి కోసం వేట ప్రారంభించారు.