karunanidhi: ఆసుపత్రి బయట వేచి చూస్తున్న అభిమానులను కలిసిన కనిమొళి.. క్షీణిస్తున్న కరుణానిధి ఆరోగ్యం!
- వైద్యానికి స్పందించని కరుణ శరీరం
- మరికొద్ది సేపట్లో మరో బులెటిన్ విడుదల చేసే అవకాశం
- అభిమానులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రి పరిసరాలు
వారం రోజులపాటు నిలకడగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కావేరీ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో తమిళనాడులో మరోమారు విషాదఛాయలు అలముకున్నాయి. తాజా వార్తతో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మరోమారు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు కరుణానిధి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా కావేరీ ఆసుపత్రికి వస్తున్నారు.
తండ్రిని పరామర్శించిన అనంతరం వెలుపలికి వచ్చిన కనిమొళి పెద్ద ఎత్తున వేచి చూస్తున్న అభిమానులను కలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని సూచించారు. అభిమానులతో కరచాలనం చేశారు. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాగా, కావేరీ ఆసుపత్రి యాజమాన్యం మరికొద్ది సేపట్లో మరో బులెటిన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. నిన్నటి బులెటిన్లో కరుణానిధి శరీరం వైద్యానికి సహకరించడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు తెలిపారు. వైద్యులు ఇలా పేర్కొనడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.