Hyderabad: తండ్రి దాచిన లక్షల నగదును ప్రియుడితో కలసి దోచేసిన కుమార్తె!

  • హైదరాబాద్ కాటేదాన్ లో ఘటన
  • ప్రియుడు వ్యాపారం చేస్తే తండ్రి పెళ్లికి అంగీకరిస్తాడని భావించిన యువతి
  • ఇంట్లోని డబ్బిచ్చి పంపి, దోపిడీగా చెప్పిన తస్కీం బాను

కష్టపడి సంపాదించిన డబ్బును ఓ తండ్రి దాచిపెడితే, తన ప్రియుడితో కలసి దాన్ని దోచుకెళ్లిందో కుమార్తె. ఈనెల 3న జరిగిన ఈ దొంగతనం కేసులో కుమార్తే ప్రధాన నిందితురాలని, ఆమెకు ప్రియుడు సహకరించాడని తేల్చిన పోలీసులు, మొత్తం విషయాన్ని మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్, కాటేదాన్, మైలార్ దేవులపల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ముజఫర్ ఇంట్లో లేని సమయంలో నలుగురు దుండగులు వచ్చి అతని కుమార్తె తస్కింబాను (20)ను కొట్టి, రూ. 22 లక్షల నగదు దోచుకెళ్లారు.

దీనిపై ముజఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. శంషాబాద్ మండలానికి చెందిన అష్రఫ్ (22) అనే యువకుడిని ప్రేమించిన తస్కీంబాను అతన్ని పెళ్లి చేసుకోవాలని భావించింది. అష్రఫ్ వ్యాపారం చేస్తున్నాడని తెలిస్తేనే, తన తండ్రి అల్లుడిగా ఒప్పుకుంటాడని భావించింది. వ్యాపారం చేసేందుకు సాయపడాలని నిర్ణయించుకుంది. తండ్రి ఓ ప్లాటును విక్రయించగా వచ్చిన డబ్బును ఇంట్లో పెట్టడాన్ని గమనించింది.

ఆపై ప్రియుడిని పిలిచి, డబ్బు ఇచ్చి పంపింది. తనకు తానే ఒంటిపై గాయాలు చేసుకుంది. ఇంట్లోకి నలుగురు చొరబడి, తనను కొట్టి డబ్బెత్తుకెళ్లారని తండ్రికి చెప్పింది. పోలీసులకు ఇంటి పరిస్థితి చూసిన తరువాత అనుమానం వచ్చి తస్కీం సెల్ ఫోన్ మెసేజ్ లను, కాల్ లిస్టును పరిశీలించారు. టోపీ ధరించిన ఓ యువకుడు ఇంటికి బైక్ పై వచ్చి వెళ్లాడని కొందరు చెప్పడంతో సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు.

ఒకే యువకుడు వచ్చి వెళ్లినట్టు గుర్తించి, ఆపై తస్కీంను గట్టిగా విచారించి, అష్రఫ్ డబ్బు తీసుకెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు. విమానంలో బెంగళూరుకు వెళ్లిన అష్రఫ్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 19.5 లక్షలను రికవరీ చేశారు. చోరీ పథకానికి ముందు రోజు ఆరాంఘర్ ప్రాంతంలో తన ప్రియుడిని తస్కీం కలిసినట్టు ఆధారాలు దొరకడం కేసులో కీలక పరిణామమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News