Karunanidhi: ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిన తమిళ సినీ, రాజకీయ దిగ్గజం కరుణానిధి!
- తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం
- రాజకీయాల్లోకి రాకముందు స్క్రీన్ రైటర్ గా కరుణ
- రాష్ట్రాన్ని శాసించిన రాజకీయ చతురుడు 'కలైంగర్'
ముత్తువేల్ కరుణానిధి... తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించిన రాజకీయ చతురుడు. అభిమానులు ఆయనను ముద్దుగా 'కలైంగర్' అని పిలుచుకుంటారు. కలైంగర్ అంటే కళాకారుడు అని అర్థం. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ గడ్డను పాలించారు. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో సంభాషణల రచయితగా ఆయన పని చేశారు. తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలులాంటివెన్నో రాశారు. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.
1924లో బ్రిటీష్ వారి పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుక్కువలై (నాగపట్నం జిల్లా)లో తమిళ నాయీబ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. కరుణానిధి అసలు పేరు దక్షిణా మూర్తి. స్కూలు రోజుల్లోనే డ్రామా, కవిత్వం, రచనపై ఆయన ఆసక్తి చూపించారు. జస్టిస్ పార్టీకి కీలక నేత అలగిరిస్వామి ప్రసంగాలతో ఉత్తేజితుడైన కరుణ... తన 14వ ఏట సాంఘిక పోరాటాల వైపు అడుగులు వేశారు.
తన కెరీర్ ను సినిమా రచయితగా ప్రారంభించిన కరుణ... తొలిసారి 'రాజకుమారి' చిత్రం కోసం పని చేశారు. ఈ సినిమా హీరో ఎంజీఆర్. ఆ తర్వాత కరుణ, ఎంజీఆర్ ల మధ్య చాలా కాలం పాటు స్నేహం కొనసాగింది. రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరూ దూరమయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేషన్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు.
14 ఏళ్ల వయసులోనే కరుణ రాజకీయపరంగా యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలగిరిస్వామి స్ఫూర్తితో ఆయన స్థానికంగా ఓ యూత్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. దీంతోపాటు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు. అనంతరం... 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.
1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. డీఎంకే తొలి అధినేత కరుణానిధే కావడం గమనార్హం. పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉండేవారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన తొలి వ్యక్తి కరుణ.
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలలో డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతాపార్టీతో కరుణ పొత్తు పెట్టుకున్నారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్ ను కరుణ బహిష్కరించారు. దీంతో, అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారు. ఎమర్జెన్సీ తర్వాత జరగిన ఎన్నికల్లో డీఎంకే ఓడిపోగా, అన్నాడీఎంకే విజయం సాధించింది. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
కరుణ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలం:
- 1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4వ తేదీ వరకు
- 1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31 వరకు
- 1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30 వరకు
- 1996 మే 13 నుంచి 2001 మే 13 వరకు
- 2006 మే 13 నుంచి 2011 మే 15 వరకు
కరుణను 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. తంజావూర్ యూనివర్శిటీ ఆయనను 'రాజ రాజన్' అనే బిరుదుతో సత్కరించింది. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలతో అప్పటి జయలలిత ప్రభుత్వం కరుణను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు కరుణానిధి సాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడు అంటూ కరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పద్మావతి అమ్మాల్, దయాళు అమ్మాల్, రజతి అమ్మాల్ లను కరుణ వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు భార్యలతో ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు, సెల్వి, కనిమొళి జన్మించారు.