karunanidhi: కరుణానిధి కంటే మాకేదీ ముఖ్యం కాదు.. కేసును ఉపసంహరించుకుంటున్నా: లాయర్ దొరైస్వామి
- మెరీనా బీచ్‌లో స్థలం కోరిన కరుణ కుటుంబ సభ్యులు
- కేసులున్న కారణంగా కుదరదన్న ప్రభుత్వం
- కేసు ఉపసంహరణకు సిద్ధమన్న దొరైస్వామి
కరుణానిధి కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, కాబట్టి మెరీనా బీచ్‌లో అంత్యక్రియలపై వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయవాది దొరైస్వామి తెలిపారు. తాము పిటిషన్ ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కాబట్టి కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించవచ్చని అన్నారు.
కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్ వద్ద స్థలం కావాలంటూ కరుణ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అక్కడ అనుమతి ఇవ్వలేమని, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెబుతూ ప్రభుత్వం చేతులెత్తేసింది.
ప్రత్యామ్నాయంగా గాంధీ మండపం సమీపంలో గిండీ వద్ద అన్నా యూనివర్సిటీ ఎదురుగా రెండెకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కరుణానిధి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన దొరైస్వామి, మెరీనా బీచ్ వద్ద అంత్యక్రియలు నిర్వహించడాన్ని నిషేధించాలంటూ గతంలో తాను హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. అనుమతులు మంజూరు చేస్తే నేటి సాయంత్రం మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు జరుగుతాయి.