Matrimonial Site: నయా సైబర్ మోసం... పెళ్లిచూపులంటూ నొక్కేశారు!
- అమెరికా సంబంధమంటూ ఆశపడ్డ హైదరాబాద్ వాసి
- పెళ్లి చూపుల్లో చీర మీరే తేవాలంటూ డబ్బు నొక్కేసిన నేరగాళ్లు
- ఆపై తప్పుడు చిరునామా ఇచ్చి మోసం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
వివాహాలు కుదుర్చే ఓ వెబ్ సైట్ ను ఉపయోగించుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. పెళ్లిచూపుల పేరు చెప్పి వేలు నొక్కేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా, 'తెలుగు మ్యాట్రిమోనీ డాట్ కామ్'లో రిజిస్టర్ చేసుకున్నారు. అందులో నిహారికా రెడ్డి పేరిట ఓ ప్రకటన కనిపించింది. ఉన్నత విద్య చదివిన ఆమె, యూఎస్ లోని హెచ్పీలో పనిచేస్తోందని, ఆమె తండ్రి నారాయణరెడ్డి బెంగళూరులో రెవెన్యూ ఉద్యోగి, తల్లి సుశీల కేంద్రీయ విద్యాలయకు వైస్ ప్రిన్సిపాల్ అని ఉంది. ఈ ప్రొఫైల్ ను శ్రీనివాస రెడ్డి లైక్ చేశారు.
ఆ తరువాత నేరగాళ్ల ప్లాన్ అమలైంది. శ్రీనివాస రెడ్డికి, తాను బెంగళూరు నుంచి నారాయణరెడ్డిని మాట్లాడుతున్నానంటూ ఓ ఫోన్ వచ్చింది. తన కుమార్తె నిహారిక అమెరికా నుంచి వచ్చిందని, తిరిగి వెళ్లిపోయేలోపే మంచి సంబంధం చూసి నిశ్చితార్థం చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. శ్రీనివాసరెడ్డి కుమారుడితోనూ నిహారికగా చెప్పుకుంటూ ఓ యువతి మాట్లాడింది. ఆపై తాము పెళ్లి చూపుల కోసం బెంగళూరు వస్తున్నామని చెప్పగా, ఆనందంగా అంగీకరిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు.
పెళ్లి చూపుల సమయంలో పెళ్లి కుమార్తె కట్టుకునే చీరను పెళ్లి కుమారుడి తరఫు వారే కొనాలంటూ ఓ కథ చెప్పాడు నారాయణరెడ్డి. తన కుమార్తె మంచి పట్టుచీరను సెలక్ట్ చేసుకుందని చెప్పాడు. దీనికి డబ్బు పంపాలని కోరాడు. దీంతో రెండు దఫాల్లో రూ. 80 వేలను నారాయణరెడ్డి చెప్పిన ఖాతాకు శ్రీనివాసరెడ్డి బదిలీ చేశారు. తర్వాత పెళ్లి చూపుల కోసం రావాలని ఓ అడ్రస్ ఇచ్చాడు. దీంతో, గత నెల 24న మొత్తం కుటుంబం అక్కడికి వెళ్లిన తరువాతే వారికి తాము ఘోరంగా మోసపోయామని, తప్పుడు చిరునామా ఇచ్చారని వారికి అర్థమైంది. దీంతో ఉసూరుమంటూ వెనక్కు తిరిగి వచ్చిన శ్రీనివాసరెడ్డి సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.