Rains: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన కారుమబ్బులు!
- వాయుగుండంగా మారిన అల్పపీడనం
- ఏపీ, తెలంగాణలపై ప్రభావం
- వచ్చే రెండు రోజుల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. నిన్న మధ్యాహ్నం వాయుగుండం ఏర్పడి, రాత్రికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ నడుమ కేంద్రీకృతమై, బాలాసోర్ దగ్గరకు వెళుతోంది. దీని ప్రభావం ఒడిశా, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల రెండు రోజుల వ్యవధిలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్ర ఉపరితలం అల్లకల్లోలంగా ఉంటుందని, చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని సూచించారు.
కాగా, గత రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు వర్షం పడింది. విశాఖపట్నంలో సముద్రపు అలలు తీరంవైపు దూసుకు వస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున తేలికపాటి జల్లులు కురిశాయి.