China: 20 ఏళ్ల తరువాత వాణిజ్య లోటులో పడిపోయిన చైనా!
- 17 సంవత్సరాల తరువాత కరెంట్ అకౌంట్ డెఫిషిట్
- 28.3 బిలియన్ డాలర్ల సీఏడీ
- రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
గడచిన రెండు దశాబ్దాలుగా ఓ పెద్ద ఎగుమతిదారుగా ఉన్న చైనా, వాణిజ్య లోటును నమోదు చేసింది. 20 సంవత్సరాల తరువాత చైనా ఎగుమతుల కన్నా, దిగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కరెంట్ అకౌంట్ డెఫిషిట్ (సీఏడీ) కూడా నమోదైంది. చైనాలో సీఏడీ నమోదు కావడం 17 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాతో ట్రేడ్ వార్ ప్రారంభం కావడం, చైనా ఉత్పత్తులకు తగ్గిన డిమాండ్ కారణంగా జనవరి - జూన్ మధ్యకాలంలో 28.3 బిలియన్ డాలర్ల సీఏడీ నమోదైంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై తీరని దెబ్బే.
స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (సేఫ్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, చైనా సర్వీస్ ట్రేడ్ డెఫిషిట్ మూడు నెలల క్రితం 73.6 బిలియన్ డాలర్లుకాగా, ఇప్పుడది ఏకంగా 147.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. రవాణా, ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) తదితరాలు ఈ లోటుపై ప్రభావాన్ని చూపించాయని అధికార వార్తాసంస్థ 'షిన్హువా' పేర్కొంది. ఇదే సమయంలో ఉత్పత్తి వాణిజ్యంలో మాత్రం 155.9 బిలియన్ డాలర్ల మిగులును చైనా నమోదు చేసింది. 2007లో 9.9 శాతంగా ఉన్న కరెంట్ ఖాతాల మిగులు 2017లో 1.3 శాతానికి తగ్గిందని 'సేఫ్' వెల్లడించింది. ఈ వాణిజ్యలోటు మరింతకాలం పాటు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.