Rajya Sabha: కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయబోతున్నాం: టీడీపీ ఎంపీలు
- రేపే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక
- ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్
- విపక్షాల తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్టు టీడీపీ స్పష్టం చేసింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ కు ఓటు వేయాలని... తమ అధినేత చంద్రబాబు, తమ పార్లమెంటరీ పార్టీ తరపున తాము నిర్ణయం తీసుకున్నామని సుజనా చౌదరి తెలిపారు. మరోవైపు, పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సభ్యుడిగా పోటీ చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వేడిని పుట్టిస్తోంది. రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఎన్నిక జరుగుతుంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ పడుతుండగా, విపక్షాల తరపున అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ బరిలోకి దిగారు. ఈరోజు వీరిద్దరూ తమ నామినేషన్లను సమర్పించారు. డిప్యూటీ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకోవడం ద్వారా బీజేపీకి షాక్ ఇవ్వాలని విపక్షాలు భావిస్తున్నాయి.