roja: ఈ అమ్మాయి కూడా కుల పిచ్చి రాక్షసుల వల్లే చనిపోయింది: ఎమ్మెల్యే రోజా

  • డాక్టరు శిల్ప ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది
  • ఏపీ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు
  • నిందితులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలి
  • రూ.25 లక్షలు నష్టపరిహారం కింద ఇవ్వాలి

ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన శిల్ప ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ఈ అమ్మాయి కూడా కులపిచ్చి రాక్షసుల వల్లే చనిపోయిందన్న విషయం స్పష్టంగా అర్థమౌతోందని అన్నారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఓ మహిళకు రక్షణ లేకపోవడం దారుణమని.. పరిపాలనా లోపమని అన్నారు. ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేసి నిందితులను శిక్షించి ఉంటే శిల్పకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

గురువే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఏపీ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా ప్రయోజం లేకుండా పోయిందని, ఆమె ఆత్మహత్యకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీలో సభ్యులు ఈ జిల్లాకు చెందిన వారే ఉంటారని, వాళ్లందరూ ఈ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో మహిళల అక్రమ రవాణా, వేధింపులు, ఆత్మహత్యలలో ఏపీ నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. శిల్ప తరపున పోరాడుతున్న విద్యార్థి సంఘాలకు తాము మద్దతుగా నిలుస్తామని, ఆమె కుటుంబానికి న్యాయం చేసే వరకు వదిలిపెట్టమని, ఆ ప్రొఫెసర్ల చేతిలో ఇంకే అమ్మాయి కూడా బలికాకుండా చూసుకుంటామని అన్నారు. హెచ్ఓడీ రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కిరీటీ, శశికుమార్ లపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఓ అమ్మాయి ప్రాణం పోయిందని, ఆమె కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News