jenasena: ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ విజ్ఞాపనకు కేంద్ర ప్రభుత్వం విలువ ఇవ్వాలి: పవన్ కల్యాణ్
- గంగా చట్టం తీసుకురావాలని ఆయన దీక్ష
- ఆ దీక్షకు నైతిక మద్దుతిస్తున్నా
- అగర్వాల్ తో మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
గంగా నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సనంద్ జీ) విజ్ఞాపనకు ప్రభుత్వం విలువ ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత 47 రోజులుగా ఈ డిమాండ్ తో అగర్వాల్ నిరాహార దీక్ష చేస్తున్నా పాలకపక్షం స్పందించకపోవడం సరికాదని, గంగా నదిని నిర్మలంగా, కాలుష్యరహితంగా, నిరంతరాయంగా ఆ జలాలు పారేలా చేయాలనే సంకల్పంతో 86 ఏళ్ల ఈ ప్రొఫెసర్ చేస్తున్న దీక్షపై స్పందించి వారితో మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
అగర్వాల్ చేపట్టిన దీక్షకు ‘జనసేన’ నైతిక మద్దతు తెలియజేస్తోందని, పర్యావరణ పరిరక్షణ అనేది ‘జనసేన’ సిద్ధాంతాల్లో భాగమని, పర్యావరణానికి విఘాతం కలగకుండా అభివృద్ధి సాగాలి అనేది తమ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాలకు జీవనాడి అయిన గంగ పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, స్చేచ్ఛగా పారాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని అగర్వాల్ డిమాండ్ చేస్తున్నారని ఈ విషయంలో వారితో చర్చించడం ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అని సూచించారు. పవిత్రమైన గంగా నది కోసం హరిద్వార్ లో జూన్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ విషయంలో మార్గదర్శి అయిన అగర్వాల్ కోరినట్టు గంగా పరిరక్షణ కోసం తక్షణమే పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేయాలని, ఆయన దీక్ష విరమింపజేసి ప్రాణాలను కాపాడా వలసిందిగా మనవి చేస్తున్నామని పవన్ కోరారు.