Bhart bandh: దళిత సంఘాల ‘సింహగర్జన’.. నేడు భారత్ బంద్
- సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టిన ప్రభుత్వం
- సవరణలు లేకుండానే అట్రాసిటీ బిల్లు ఆమోదం
- అయినా వెనక్కి తగ్గని దళిత సంఘాలు
‘సింహ గర్జన’ పేరుతో నేడు దళిత సంఘాలు భారత్ బంద్ నిర్వహించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్ మహాసభ (ఏఐఏఎం) ఆధ్యర్యంలో బంద్ నిర్వహించనున్నారు. మార్చి 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఎటువంటి మార్పులు చేయకుండానే యథాతథంగా ఆమోదించింది. దీంతో దళిత సంఘాలు బంద్‌ను ఉపసంహరించుకుంటాయని ప్రభుత్వం భావించింది. అయితే, దళిత సంఘాలు మాత్రం వెనక్కి తగ్గకపోవడమే కాకుండా, ఈ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. అలా అయితేనే దళితులకు రక్షణ ఉంటుందని చెబుతున్నాయి.
బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ‘సింహగర్జన’ సభలో ఇదే విషయాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధారకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు హనుమంతరావు హాజరై సంఘీభావం తెలిపారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఏప్రిల్ 2న నిర్వహించిన బంద్ సందర్భంగా దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.