independence day: ప్లాస్టిక్‌తో చేసిన జాతీయ జెండాలను ఉపయోగించొద్దు: పౌరులను కోరిన ప్రభుత్వం
- రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
- జాతీయ జెండా దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని వ్యాఖ్య
- ప్లాస్టిక్ జెండాలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పౌరులెవరూ ప్లాస్టిక్‌తో చేసిన జాతీయ జెండాలను ఉపయోగించవద్దని కోరింది. ఫ్లాగ్ కోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. దానిని గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో పేపర్ పతాకాలకు బదులు ప్లాస్టిక్‌తో తయారైన జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. కాగితంలా వీటికి మట్టిలో కలిసిపోయే గుణం లేదని, డీ కంపోజ్ కాకపోవడంతో పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ ఫ్లాగ్‌లను ఉపయోగించరాదన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పేపర్లు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వనున్నట్టు తెలిపింది. రాష్ట్రాలు కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.