karunanidhi: ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. నిన్న, ఈ రోజు చెన్నైలో తెరుచుకున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు!
- కరుణానిధి మృతికి నివాళిగా ఏడు రోజుల సంతాప దినాలు,
- రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న స్కూళ్లు, కార్యాలయాలు
- వెల్లువెత్తుతున్న విమర్శలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి నివాళిగా పళని సర్కారు రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు ప్రకటించింది. అయితే, తమిళనాడు వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు ఇదేమీ పట్టినట్టు లేదు. అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతుండగానే బుధవారం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా యథావిధిగా పనిచేశాయి. గురువారం కూడా మామూలుగానే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం పబ్లిక్ హాలీడే ప్రకటించినప్పటికీ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరుణానిధిని చివరిసారి చూసేందుకు రాష్ట్రం మొత్తం కదిలివచ్చింది. అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. అయినప్పటికీ ఇదేమీ పట్టనట్టు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేయడం గమనార్హం. విషయం తెలుసుకున్న ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. పాఠశాలలు, కాలేజీలు తెరిచిన వారిపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు, ఓ యోధుడు మరణిస్తే ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.