Maharashtra: కేవలం గూగుల్ సాయంతో మొబైల్ దొంగను పట్టుకున్న యువతి!
- మహారాష్ట్రలోని మలద్ లో ఘటన
- రైల్వే స్టేషన్ లో పట్టుకున్న వైనం
- గూగుల్ అకౌంట్ తో దొంగకు చెక్
మన మొబైల్ ఫోన్ పోతే ఏం చేస్తాం? వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం. సిమ్ కార్డును బ్లాక్ చేయిస్తాం. కేసు విషయం ఏమయిందని వారానికోసారి పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి కనుక్కుంటాం. ఆ తర్వాత ఇకపోయిన వస్తువు రాదులే అని ఆశలు వదిలేసుకుంటాం. అయితే ముంబైకి చెందిన జీనత్ బాను హక్(19) మాత్రం అలా వదిలేయలేదు. కేవలం గూగుల్ సాయంతో అతన్ని వెంటాడి, వేటాడి పట్టుకుంది.
ఇక్కడి మరోల్ ప్రాంతంలోని ప్రీస్కూల్ లో జీనత్ పనిచేస్తోంది. అయితే ఆదివారం మలద్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చి చూసుకోగా తన రెడ్ మీ 4ఏ ఫోన్ కనిపించలేదు. దీంతో వెంటనే తన గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిన జీనత్.. పోగొట్టుకున్న ఫోన్ లో లొకేషన్ ను యాక్టివేట్ చేసింది. దీంతో అవతలి వ్యక్తి మొబైల్ లో ఏమేం చేస్తున్నాడు? ఏయే వీడియోలు చూస్తున్నాడు? వంటి సమస్త సమాచారం జీనత్ కు చేరేది.
దీంతో ఆమె మరో ఆండ్రాయిడ్ ఫోన్ సాయంతో తస్కరించిన ఫోన్ పై నిఘా పెట్టింది. తొలుత కాలా సినిమాలో పాటలను సెర్చ్ చేసిన నిందితుడు.. ఆ తర్వాత వాట్సప్ ను అప్ డేట్ చేశాడు. సెల్ఫీ కూడా తీసుకున్నాడు. చివరికి దాదర్ నుంచి తిరువణ్ణమలైకి రైల్వే టికెట్ బుక్ చేశాడు. అనంతరం దాని పీఎన్ఆర్ నంబర్ ను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు.
దీన్ని గమనించిన జీనత్ అతని ఫొటోతో పాటు పీఎన్ఆర్ నంబర్ తో రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది. చివరికి సోమవారం రైలు బోగీలో ఎక్కిన సెల్వరాజ్ శెట్టి(32)ని రైల్వే అధికారులు దాదర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.