amit shah: కన్ను కొట్టడం నుంచి తీరిక దొరికితే కొంచెం ఇటు కూడా చూడండి: రాహుల్ కు బీజేపీ చీఫ్ చురకలు!
- ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణ తెస్తున్నామని షా వెల్లడి
- వీటిని కూడా గమనించాలని ట్విట్టర్ లో చురకలు
- వార్తా కథనం క్లిప్ ను జతచేసిన బీజేపీ చీఫ్
ప్రతిపక్షాల ఏకీకరణకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ చీఫ్ అమిత్ షా చురకలు అంటించారు. రాహుల్ ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీని కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడుతూ కన్నుగీటారు. తాజాగా ఈ అంశం ఆధారంగా అమిత్ షా రాహుల్ పై సెటైర్లు వేశారు.
‘రాహుల్ జీ.. కన్ను కొట్టడం, పార్లమెంటు కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడం వంటి పనుల నుంచి మీకు తీరిక దొరికితే కొంచెం ఇటు కూడా చూడండి. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు సవరణ తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదంతా చూడకుండా మీరు అక్కడ ఆందోళన ఎందుకు చేస్తున్నారు?’ అని షా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం వైఖరికి నిరసనగా దళిత, గిరిజన సంఘాలు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో సీపీఎం నేత సీతారాం ఏచూరితో కలసి రాహుల్ పాల్గొన్న న్యూస్ క్లిప్ ను ఈ ట్వీట్ కు షా జత చేశారు.