TRS: టీఆర్ఎస్కు కేంద్రం షాక్.. కాళేశ్వరానికి జాతీయ హోదా కుదరదన్న గడ్కరీ!
- విభజన చట్టంలో ఉంది కాబట్టే పోలవరానికి జాతీయ హోదా
- భవిష్యత్తులో మరి దేనికీ ఇచ్చేది లేదన్న గడ్కరీ
- టీఆర్ఎస్ ఎంపీల నిరసన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేబట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇచ్చామని, భవిష్యత్తులో మరే ప్రాజెక్టుకు అలాంటి హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గడ్కరీ ప్రకటనతో తీవ్ర అసంతృప్తికి లోనైన టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
లోక్సభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ గడ్కరీకి లేఖ రాస్తూ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లుగా చేస్తున్న అభ్యర్థనను విస్మరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఏ విభజన చట్టాన్ని చూపెట్టి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారో, అదే చట్టంలో కాళేశ్వరం గురించి కూాడా ప్రస్తావించారని పేర్కొన్నారు. కాబట్టి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.