Tirumala: తిరుమలకు చేరుకుంటున్న ఉద్ధండ పండితులు... దర్శన ఆంక్షలు మొదలు!
- రేపు వైభవంగా మహాసంప్రోక్షణకు అంకురార్పణ
- దివ్యదర్శనాన్ని, టైం స్లాట్ కేటాయింపును నిలిపివేసిన టీటీడీ
- రేపటి నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువుకు రేపు వైభవంగా అంకురార్పణ జరగనుండగా, భక్తులపై దర్శన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రేపు రాత్రి విష్వక్సేనుల ఊరేగింపు తరువాత, ఆదివారం ఉదయం నుంచి మహా సంప్రోక్షణ ప్రారంభం కానుంది. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 45 మంది ఉద్ధండ పండితులు తిరుమలకు చేరుకుంటున్నారు.
ఇప్పటికే యాగశాలలో ఇటుకలు, ఎర్రమట్టితో 28 హోమగుండాలు నిర్మించి, వాటిని గోమయంతో అలికారు. 21 హోమ వేదికలూ ఏర్పాటు అయ్యాయి. ఇక్కడి కరెంటు తీగలు, బల్బులు, సీసీ కెమెరాలను తొలగించి, వెలుతురు కోసం 1000 నెయ్యి దీపాలను ఏర్పాటు చేశారు. సంప్రోక్షణ పుష్పాలంకరణ కోసం 8 టన్నుల పూలు, 30 వేల కట్ ఫ్లవర్స్ ను దాతలు అందించనుండగా, ఆలయం ముందు శ్రీవారి భారీ ప్రతిమ ఏర్పడనుంది. నిన్న అర్ధరాత్రి నుంచి దివ్యదర్శనం, సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ, ఇప్పటికే సర్వదర్శనాన్ని పరిమిత సంఖ్యలో అమలు చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.