Rajasthan: పెళ్లిళ్లు కావడం లేదని.. ఏకంగా ఊరిపేరు మార్చుకున్న గ్రామస్తులు!: రాజస్తాన్ లో వింత ఘటన
- ఊరి పేరును మహేశ్ నగర్ గా మార్చుకున్న ప్రజలు
- యువకులకు వివాహాలు కాకపోవడంతో నిర్ణయం
- గతంలో ఇదే పేరు ఉండేదంటున్న స్థానిక ఎమ్మెల్యే
సాధారణంగా ఏ ఊరిలో అయినా మంచినీరు, రోడ్లు, వైద్యం వంటి సదుపాయాలు లేకుంటే ఆడపిల్లల్ని ఇచ్చేందుకు చుట్టుపక్కలవారు జంకుతారు. తమ పిల్లలు ఆ ఊరికి వెళ్లి కష్టాలు పడకూడదని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. దీంతో సరైన సౌకర్యాలు లేని ఊర్లలోని వారితో సంబంధాలు కలుపుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. కానీ రాజస్తాన్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది.
ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నా, యువకులు మంచి ఉద్యోగాలు చేస్తున్నా చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిల్ని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. ఎందుకంటే ఈ ఊరి పేరు మియాంకా బరా అని ఉండటమే. ముస్లిం ఊరిపేరు కావడంతో తమ కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామం పేరును మార్చాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశాక, తాజాగా అధికారులు ఊరి పేరును మార్చారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఊరికి మహేశ్ నగర్ గా పేరు పెట్టారు.
ఈ విషయమై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్మీర్ సింగ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ గ్రామాన్ని మహేశ్ నగర్ అనే పిలిచేవారనీ, కాలక్రమంలో కొన్ని కారణాలతో దీన్ని మార్చాల్సి వచ్చిందని తెలిపారు.