Vijayawada: దుర్గ గుడిలో చీర మాయం కేసు.. ఈవోపై ప్రభుత్వం బదిలీ వేటు!
- ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మకు బాధ్యతలు
- పాలక మండలి సభ్యురాలు సూర్యలత తొలగింపు
- నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కనక దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీర మాయమైన ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆలయ ఈవో పద్మపై బదిలీ వేటు వేసింది. ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమించింది. అమ్మవారి చీర మాయం కేసులో పాలకమండలి సభ్యురాలు సూర్యలత ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమెను ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది.
కాగా, విధుల్లో చురుగ్గా ఉండకపోవడంతోనే పద్మను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ ఈవోతో పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా పద్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారనీ, దీంతో ఆమె గందరగోళానికి గురి అవుతున్నారని తెలిపాయి. ఆమధ్య దుర్గ గుడిలో క్షుద్ర పూజల వివాదం తలెత్తడంతో ఆలయ ఈవోగా ఉన్న ఐఏఎస్ అధికారిణిని తొలగించిన ప్రభుత్వం.. పద్మను ఈవోగా నియమించింది. తాజాగా చీర మాయం వివాదంతో పద్మ స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది. పద్మ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా కొనసాగుతారు.