Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై ఇంకా అనుమతి రాలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- 13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన
- రాహుల్ బస్సుయాత్ర ద్వారా సభకు చేరుకుంటారు
- బూత్ కమిటీ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ ఉంటుంది
ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాహుల్ చేరుకుంటారని చెప్పారు. ఆ వెంటనే రాజేంద్రనగర్ లోని క్లాసిక్ గార్డెన్ లో మహిళా సంఘాలతో రాహుల్ భేటీ అవుతారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఇచ్చే పథకాలపై చర్చిస్తారని అన్నారు.
అనంతరం, అక్కడి నుంచి బస్సుయాత్ర ద్వారా శేరిలింగంపల్లి సభకు చేరుకుంటారని చెప్పారు. 14వ తేదీ ఉదయం బూత్ కమిటీ కార్యకర్తలతో రాహుల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తారని, మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్ క్లబ్ లో ఎడిటర్ల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఇంకా అనుమతి రాలేదని ఉత్తమ్ చెప్పారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా మాట్లాడుతూ, రాహుల్ పర్యటనతో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు భయం పట్టుకుందని అన్నారు. అందుకే, ఓయూ, హాకీ గ్రౌండ్ లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, అనుమతి వస్తే కనుక రాహుల్ కచ్చితంగా ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటిస్తారని చెప్పారు.